సామెతలు
వికీపీడియా నుండి - సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత , తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ( "ఊరక రారు మహానుభావులు" ). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ( "క్షేత్రమెరిగి విత్తనం వెయ్య…